ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుత ఏప్రిల్ 19న జరిగితే.. 7వ దశ జూన్ 01న జరుగనున్నాయి. జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఎన్నికలు ఒకేసారి ఉండటంతో అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు కాస్త తర్జన భర్జన పడుతున్నాయి.
ముఖ్యంగా కూటమి అభ్యర్థులు కొంత మంది నిరాశ చెందుతున్నారు. పార్టీలో ఉన్న వారికి టికెట్ దక్కకపోవడంతో కొంతమంది రాజీనామాలు చేసి పార్టీల అధినేతలను విమర్శిస్తున్నారు. తాజాగా కాకినాడలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మేయర్ పోసపల్లి సరోజ రాజీనామా చేశారు. కాకినాడ ఎమ్మెల్యే సీటును ఆశించిన ఆమె.. ఇవాళ జనసేన విడుదల చేసిన లిస్టులో పేరు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు రాకపోవడంతో కంటతడి పెట్టారు. జనసేన పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీలా మారిందని వాపోయారు. అంతేకాకుండా పార్టీలో మహిళలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్లపై సరోజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల పర్మిషన్ ఉంటేనే తప్ప అధినేత పవన్ కల్యాణ్ కలవలేమని సరోజ ఆరోపించారు.