జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి… హిందుపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి- బాలకృష్ణ

ఆంధ్ర ప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ స్పందించారు. ఏపీలో పరిపాలన సౌలభ్యం కోరకు కొత్తగా 13 జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని బాలకృష్ణ అన్నారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురంలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా.. హిందూ పురం ఎంతో అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే అని ఆయన అన్నారు. 

హిందూపురం పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటుపై రాజకీయం చేయవద్దని సూచించారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలకు, భవిష్యత్ అవసరాలకు అనువైన భూమి పుష్కలంగా ఉందన్నారు. హిందుపురం పట్టణ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని వారి చిరకాల కోరిక ప్రకారం హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.