ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలుు నిర్వహించనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.దీంతో రేపటి( ఏప్రిల్ 27, బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.10 పరీక్షలకు ఈసారి మొత్తం 6,22,537 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.ఇందులో 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3800 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేదు.
అలాగే ఈ ఏడాది పదవ తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతోపాటు గా, తొలిసారి సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ను అందిస్తున్నారు.ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి.విద్యార్థులు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని, 9 గంటల 30 నిమిషాల తర్వాత లోపలికి అనుమతి ఉంటుందని తెలిపారు.