ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడూ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ రోజు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వివరించింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.