టమాట మళ్లీ మంటెక్కింది. వంటింట్లో టమాట లేనిదే పూట గడవకున్నా ధరల షాక్‌తో ఈ కూరగాయను మగువలు పక్కనపెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా ఏకంగా రూ. 100 దాటడంతో కొనేందుకు వినియోగదారులు వెనుకాడుతున్న పరిస్ధితి. ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. రైతుబజార్లలో టమాటా కేజీ రూ.50కే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
టమాటా ధరలు రూ.100కు చేరడంతో ప్రజలపై భారం లేకుండా ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నేటి నుంచి అన్ని నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లలో కేజీ రూ. 50కి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. మదనపల్లె, పలమనేరు, పత్తికొండ, కలికిరి మార్కెట్లలో రైతుల నుంచి రూ. 70 చొప్పున రోజు 50-60 టన్నులు సేకరించనున్నారు. ధరలు అదుపులోకి వచ్చేవరకు సబ్సిడీ కొనసాగిస్తామని రైతు బజార్ల సీఈఓ నందకిషోర్ తెలిపారు.