“మనలోకం” ప్రత్యేకం: బాబు – నీలం…. రాజకీయ విలువలు!

-

సాధారణంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నవారు.. తమ పాలనను, తమ రాజకీయానుభవాన్ని, తాను చేసిన పథకాలను, తాను నడిచిన నడతను, తాను పాటించిన విధానాలను, తన వ్యక్తిత్వాన్ని, తన నిజాయితీని … ప్రత్యర్ధి పార్టీలకు ఉదాహరణలుగా చూపిస్తూ విమర్శలు చేస్తుంటారు. ఇది సహజం… కానీ ఈ మధ్యకాలంలో చాలా పనులు అసహజంగా చేయ ప్రయత్నిస్తున్న బాబు… జగన్ హైకోర్టు కేసులకు – నీలం సంజీవరెడ్డి రాజకీయ విలువలకు పోల్చుతూ ట్వీట్లు చేశారు. అది ఈ రోజుల్లో ఎంతవరకూ లాజికల్ అనే సంగతి కాసేపు పక్కన పెడితే… ఇదే విషయాన్ని బాబుకు ఆపాదిస్తున్నారు వైకాపా నేతలు!

తనను తాను ఉదాహరణగా చూపించుకోవడానికి, ఆదర్శంగా చెప్పుకోవడానికి అర్హుడిని కాదని భావించారో ఏమో కానీ… నీలం సంజీవరెడ్డి ని ఆదర్శంగా చూపించారు బాబు! నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు… నీలం పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేసిన సంజీవరెడ్డి… తాను లోక్‌ సభ సభాపతిగా ఎన్నిక కాగానే, నిస్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టారన్నారు. కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, కానీ ఈనాడు గౌరవ పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒకసారి కాదు 65సార్లు తప్పుపట్టినా దులిపేసుకోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

అంతవరకూ బాగానే ఉంది..  నీలం సంజీవరెడ్డి గారిలో ఉన్న నిబద్దత, విలువలు చాలా గొప్పవి, ఎవరూ కాదనలేనివి, అందరికీ ఆదర్శవంతమైనవి! కానీ… నీలంలో ఉన్న నిబద్దత, విలువలు బాబులో ఎందుకు లేకుండా పోయాయని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని విమర్శలు రాగానే.. ఆ పదవికి బాబు రాజినామా చేసి ఉండాల్సింది. అలా కానిపక్షంలో ఆ పార్టీని వదిలేసి, సొంతంగా పార్టీ స్థాపించి ఎదగాల్సింది.. విలువలేవి?

ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టి, పిల్లనిచ్చి, పదవులిచ్చిన మనిషిని.. పదవి నుంచి దింపేశారనే విమర్శలు రుజువులతో సహా బయటకు వచ్చినప్పుడు రాజకీయ సన్యాశం తీసుకోవాల్సింది.. లేదా, కనీసం పశ్చాత్తాపపడి అయినా ఏడాదికోసారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద క్షమాపణ అయినా చెప్పుకోవాల్సింది.. విశ్వాసనీయత ఏది.. విలువలేవి?

రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేకుండా, ప్రజాతీర్పుపై ఏమాత్రం పట్టింపు లేకుండా వైకాపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు అయినా నీలం సంజీవరెడ్డి గారిలాంటివారిని గుర్తుకు తెచ్చుకుని ఉండాల్సింది.. విలువలేవి?

రెండెకరాల నుంచి లక్షల కోట్లు సంపాదించారనే విమర్శలు వస్తున్నప్పుడు.. తండ్రి నుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచేసిన పుచ్చలపల్లి సుందరయ్య గుర్తుకు రావాల్సింది.. విలువలేవి?

అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కోకుండా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నప్పుడు ఇదే నీలం సంజీవరెడ్డిని గుర్తుకు తెచ్చుకుని, పదవికి రాజినామా చేసి ఉండాల్సింది… లేదా కనీసం స్టే తెచ్చుకోకుండా ఉండాల్సింది.. విలువలేవి?

“మా వాళ్లు బ్రీఫ్డ్ మీ…” అంటూ తెలంగాణలో నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నప్పుడు, హైదరాబాద్ ని వదిలేయకుండా పోరాడి, తమ నిజాయితీని నిరూపించుకుని ఉండాల్సింది.. విలువలేవి?

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే… ఇలాంటివి ఎన్నో ఉన్న బాబు ఇవన్నీ మరిచి.. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడటానికి మించిన హాస్యాస్పద విషయం మరొకటి ఉండదని కౌంటర్లు పడిపోతున్నాయి.

ఏది ఏమైనా… తాను ఇంకా రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోలేదు కాబట్టి.. పైగా బాబు జీవితం చాలా మందికి తెరిచిన పుస్తకము, తెలిసిన పుస్తకమే కాబట్టి.. ఇలాంటి (రాజకీయ) విలువల గురించి బాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పలువురు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news