ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఎవరైనా ఎంతవరకు ఉపేక్షిస్తారు? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తొక్కేస్తారు. ఇప్పుడు అదే జరిగింది పేరెన్నికగన్న దమ్మున్న పత్రిక ఆంధ్రజ్యోతి విషయంలో! అవసరం ఉన్నా లేకున్నా.. వైఎస్సార్సీపీ సర్కారుపైనా, సీఎం జగన్‌పైనా విమర్శించడమే పనిగా.. దుమ్మెత్తి పోయడమే విధిగా పెట్టుకున్న ఈ పత్రికను జగన్ అదును చూసి దెబ్బకొట్టేశారు. ఇదే విషయాన్ని పత్రిక వెల్లడించి బోరు మంటోంది. అయితే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం. పైగా దీనిపై న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. సరే.. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. అధికారంలో ఉన్న ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలు, చేపట్టే సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడం సాధారణం.
ఈ క్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు పెద్ద ఎత్తున యాడ్లు ఇవ్వడం పరిపాటి. ఇది చంద్రబాబు హయాంలో జోరుగా సాగింది. తన అనుంగు అనుకూల మీడియాలను ఆయన పోషించిన రీతిలో ఎవరూ పోషించలేదనే చెప్పాలి. ఆయన లేస్తే.. ప్రచారం .. కూర్చుంటే ప్రచారం అన్నట్టుగా ప్రజాధనాన్ని ప్రచారానికే ధారపోశారు. ఇక, ఇప్పుడు జగన్ ప్రబుత్వం కూడా తామేమీ తక్కువ తినలేదని అంటోంది. రాష్ట్ర ఖజానా కొల్లగొడుతోందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని చెబుతున్నా.. ప్రచారానికి మాత్రం గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఏడాది కాలంలో జగన్ చేసిన ప్రచార ఖర్చుపై ఓ వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకున్నాడు.
సదరు సమాచారాన్ని ఆయన నేరుగా ఆంధ్రజ్యోతికే ఎందుకిచ్చారో తెలియదు కానీ, ఆ పత్రిక అచ్చేసింది. దీంతో దాదాపు వంద కోట్ల రూపాయలు జగన్ ప్రకటనలకు ఖర్చు చేశారని, దీనిలో సగానికి పైగా అంటే యాభైరెండు కోట్ల రూపాయలను ఆయన తన సొంత మీడియా సాక్షికే ఇచ్చారని, మిగిలిన దాంట్లో 39 శాతం ఈనాడుకు ఇచ్చారని, మాకు మాత్రం పావలానే ఇచ్చారని పత్రిక కన్నీరు పెట్టేసింది. అదే సమయంలో విమర్శనాత్మక పత్రికలపై జగన్ వివక్ష చూపిస్తున్నారని మళ్లీ ఏకేసింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబాన్ని, జగన్‌ను ఏకేయడంలో ఈనాడును మించిన పత్రిక ఏదైనా ఉందా?
ఆయనపై ఎన్నెన్ని వార్తలు రాసింది. అయితే, ఏది ఎప్పటికి ప్రస్తుతమో.. అది రాస్తూ.. వ్యాపార వ్యూహంతో ముందుకు నడిచింది. కానీ, కేవలం విమర్శించడమే పనిగా.. పెట్టుకున్న ఆంధ్రజ్యోతి ఏదైనా ఒక్కరోజైనా.. జగన్ చేసిన మంచి పని ఇదీ.. అని బ్యానర్ వేయగలిగిందా?! అందుకే జగన్ అవకాశం చూసి దెబ్బేశాడని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పటికైనా మారి.. విమర్శలతో పాటు మంచి పనులను కూడా ప్రస్తావిస్తే.. నిజమైనా పాత్రికేయం అనిపించుకుంటుందని అంటున్నారు పరిశీలకులు.