చంద్ర‌బాబు అమ‌రావ‌తి రాగం వెన‌క మ‌రో కోణం…!

-

నా కోసం.. మీ కోసం.. మీ బిడ్డ‌ల కోసం ఏడ‌వండి..! – అన్న మాట గుర్తుందా ? ఎప్పుడో వ‌చ్చిన క‌రుణామ‌యుడు సినిమాలో జీస‌స్ పాత్ర‌లో ఉన్న విజ‌య్‌చందర్ చెప్పిన ఈ డైలాగు ఇప్ప‌టికీ స‌జీవ‌మే. అయితే, దీనికి భిన్నంగా రాష్ట్రాన్నేలిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏడుస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఆయ‌న ప్రేమంతా కూడా అమ‌రావ‌తిపైనే ఉండ‌డం. అయితే. ఈ ప్రేమలో వాస్త‌వం ఎంత ‌?  నిజంగానే ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ప‌రిత‌పిస్తున్నారా ?  లేక త‌న కోసం.. త‌న వారి కోసం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారా ?  అంటే.. రెండోదే నిజ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అమ‌రావ‌తి త‌ర‌లిపోతే.. ఏదో జ‌రిగిపోతుంద‌ని, రాష్ట్రం ముక్క‌లు చెక్క‌లు అవుతుంద‌ని, ఇంత‌కు మించిన రాజ‌ధాని ఉండ‌ద‌ని, చెబుతున్న చంద్ర‌బాబు మాటల వెనుక ఏదో నిజం దాగి ఉంద‌ని ఎప్ప‌టి నుంచో విశ్లేష‌ణలు వ‌స్తున్నాయ‌. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు మాట‌ల దాడి మ‌రింత పెరిగింది. మొదట్లో రాజధాని తరలింపు రైతుల సమస్యగా అభివర్ణించిన చంద్రబాబు.. రాను రాను దీన్ని రాష్ట్ర ఆర్థిక సమస్యగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక న‌ష్టం వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఇదే నిజ‌మైతే.. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి స‌చివాల‌యంలో ఏపీ భాగంగా వ‌చ్చిన భ‌వ‌నాల‌కు రెనోవేష‌న్ పేరుతో 720 కోట్లు ఖ‌ర్చు చేసి.. రెండోరోజే ఏపీకి వ‌చ్చేసిన‌ప్పుడు.. జ‌రిగిన ఆర్థిక న‌ష్టం గురించి కూడా చంద్ర‌బాబు చెప్పి ఉండాలి. అదే స‌మయంలో ధ‌ర్మ పోరాట దీక్ష‌ల పేరుతో ఆడిన నాటకాల‌కు రూ.100 కోట్లు (విడ‌త‌లుగా) ఖ‌ర్చు చేసిన‌ప్పుడు వ‌చ్చిన న‌ష్టాన్న‌యినా చెప్పాలి. కానీ, ఆయ‌న వాటిని వ‌దిలేసి.. మ‌రో 20 ఏళ్లకు కానీ పూర్తికాని అమరావ‌తిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు..? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే, దీనికి స‌మాధానం ఇదీ అంటున్నారు ప‌రిశీల‌కులు.

చంద్రబాబు అనుచరులు, గతంలో మంత్రివర్గ సహచరులు, ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్న నమ్మినబంటులు, కొన్ని మీడియా సంస్థల అధినేతలు.. అందరూ అమరావతిలో పెట్టుబడి పెట్టారు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నా కూడా ప్ర‌ధానంగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికే చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు. వీరి పెట్టుబ‌డుల‌కు ఏళ్ల పాటు తాను హామీ అన్న పూచీ చంద్ర‌బాబు తీసుకున్నారు.  ఐదేళ్లలో తాను చేయగలిగిందంతా చేశారు. తీరా ప్రభుత్వం మారి మూడు రాజధానులు అనే సరికి వీరంతా బాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.  దీంతో త‌న వారి కోసం.. త‌న బినామీల కోసం.. ఆయ‌న వ‌గ‌రుస్తున్నారేత‌ప్ప‌.. దీనిలో అస‌లు ప‌స‌లేద‌నేది వీరి వాద‌న‌. ఇది నిజ‌మేనా?!

Read more RELATED
Recommended to you

Latest news