టీడీపీలో మ‌రో పండుగ‌.. ముహూర్త‌మే తరువాయి..?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మ‌రోసారి ప‌ద‌వుల పండ‌గ‌కు రంగం సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్లమెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియమించిన చంద్ర‌బాబు.. కీల‌క‌మైన నాయ‌కుల ‌కు.. ప‌ద‌వుల పందేరం చేశారు. ఇక‌, త‌ర్వాత పార్టీ రాష్ట్ర క‌మిటీని ఏర్పాటు చేశారు. బీసీల‌కు పెద్ద పీట వేశారు. అదేస‌మయంలో పార్టీ జాతీయ క‌మిటీల‌ను కూడా నియ‌మించారు. దీనిలోనూ బీసీ నేత‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. ఆదిశ‌గా చంద్ర‌బాబు అప్పుడే క‌స‌ర‌త్తు కూడా ప్రారంభించార‌ని అంటున్నారు.

Chandra babu

ప్ర‌స్తుతం చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లు కూడా లేని ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొంద‌రు పార్టీలోనే ఉన్నా.. అచేత‌నంగా ఉంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ద‌వుల కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూస్తున్నారు. ఇక‌, యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఆదిశ‌గా కూడా క‌స‌ర‌త్తు ప్రారంభించార‌ని తెలుస్తోంది. పార్టీలో 33 శాతం ప‌ద‌వులు కొత్త‌వారికి యువ‌త‌కు కేటాయిస్తాన‌ని చాన్నాళ్ల కింద‌టే ఆయ‌న హామీ ఇచ్చారు. అయితే. ఇప్పటి వ‌ర‌కు కూడా ఈ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు.

అయితే, పార్ల‌మెంట‌రీ ప‌ద‌వుల్లో ఒక‌రిద్ద‌రికి అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర క‌మిటీలోనూ కొంద‌రికి అవ‌కాశం ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. మెజారిటీ యువ‌త‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో వారంతా ప‌ద‌వుల వేట‌లో ఉన్నారు. ఇప్పుడు వారిని సంతృప్తి ప‌రుస్తారా?  లేక సీనియ‌ర్లు కొంద‌రికి ఇవ్వ‌లేదుక‌నుక వారికే ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. అనంత‌పురంలో లెక్కకు మిక్కిలిగా ప‌ద‌వులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

అదేవిధంగా గుంటూరు, కృష్ణాలో నూ యువ‌త ఎదురు చూస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల ప‌ద‌వుల్లో వీరికి ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌హిళా నేత‌ల్లోనూ చాలా మందికి అవ‌కాశం చిక్క‌లేదు. ఇప్పుడు వీరి మాటేంట‌ని కూడా అంటున్నారు. మొత్తానికి త్వ‌ర‌లోనే విడుద‌ల‌య్యే నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల జాబితాలో ఎవ‌రెవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిగా మారింది.