ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఇదిలాఉంటే.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్.. అంటూ అసెంబ్లీలో జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి రఘురామ పలుకరించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరాడు.. హాజరవుతానని జగన్ బదులిచ్చారు. తాజాగా అసెంబ్లీలో జగన్, రఘురామ సరదాగా మాట్లాడుకోవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలో అన్ని శాఖలో శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి బిల్లులతో పాటు కొన్ని శ్వేతపత్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు స్పీకర్ తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనతో నలుగురు ప్యానల్ స్పీకర్లను నియమించనున్నట్టు వెల్లడించారు.