ప్రభుత్వం తల తిక్క వ్యవహారాలను మానుకోవాలని సూచించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్. రాజధాని విషయంలో ప్రభుత్వ చేతకాని విధానాలను విడనాడాలన్నారు. ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఎపి మాత్రమేనన్నారు. తగ్గేదేలే అని మంత్రులు బీరాలు పోతున్నారని.. ఇదంతా ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారో చెప్పాలి..? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు.
చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే జగన్ మద్దతు ఇచ్చారని.. ఈలోపు చంద్రబాబుతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలన్నారు. రాయలసీమ వాసులుగా మాకు అప్పుడు ఇబ్బంది అనిపించిందని.. అయినా ఏపీ ప్రజల మేలు కోరి మేం అమరావతికి అండగా నిలిచామన్నారు. జగన్ సీఎంగా ఎప్పుడైనా ప్రజల్లో, రోడ్ల మీద తిరిగితే వాస్తవం తెలిసేదన్నారు. శ్రీభాగ్ ఒప్పందంపై జగన్ కు కనీస అవగాహన లేదన్నారు.
అమరావతి ని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్ కే మంచిదన్నారు. జగన్ తమ ఆలోచనా విధానాలను, మొండి పట్టుదల వీడాలన్నారు. జగన్ వైఫల్యాలను విమర్శిస్తే దాడులు చేస్తారా..? అని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆరోజు అమరావతికి జై కొట్టిన జగన్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.