ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ లో లంక, పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఆసియా కప్ టోర్నీ లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా ఫైనల్ లో శ్రీలంక జట్టు ప్రదర్శన పట్ల ముగ్ధుడయ్యాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం గంభీర్ బౌండరీ లైన్ వద్ద శ్రీలంక జాతీయ పతాకాన్ని చేతభూని లంక అభిమానుల ముందు ప్రదర్శించాడు. గంభీర్ తమ జెండాను ప్రదర్శించడం చూసి లంక అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ దృశ్యాలను లంకేయులు తమ ఫోన్ లలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. శ్రీలంక జట్టును సూపర్ స్టార్ టీం అని అభివర్ణించాడు. ఆసియా కప్ విజేతగా వారు అన్ని విధాల అర్హులని కొనియాడాడు. లంక జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.
Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe
— Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022