టీడీపీ ఎమ్మెల్యే స్వామి అరెస్టు జగన్ రెడ్డి ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ అవినీతి మరకలను ప్రతిపక్ష నేతలకు అంటగట్టే కుట్ర జరుగుతున్నదని.. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అధికార పార్టీ పిలుపునివ్వడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను వదిలిపెట్టి టీడీపీ ఎమ్మెల్యే స్వామిని అరెస్టు చేయడం అనైతికం, అప్రజాస్వామికమని.. అవినీతి, లూటీలు వైసీపీ పేటెంటు హక్కులు అంటూ రెచ్చిపోయారు.
పిల్లల పాల ప్యాకెట్లు, చిక్కీలలో కూడా కమీషన్లు కొట్టేసిన చరిత్ర వైసీపీ నాయకులదని.. దళిత ఎమ్మెల్యేలు అంటే జగన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్యే స్వామి జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధవంతంగా ఎండగడుతున్నారనే ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. బెదిరింపులకు స్వామి బయపడుతాడనుకుంటే అది మీ భ్రమే అన్నారు. ప్రతిపక్ష నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అంతకు రెట్టించి వారు ప్రజల కోసం పనిచేస్తారని వైసీపీ నాయకులు గుర్తించుకుంటే మంచిదని.. దళితులను అవమానిస్తున్న జగన్ రెడ్డికి ఆ దళితులే బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అరెస్టు చేసిన బాల వీరాంజనేయ స్వామిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.