టీడీపీలో కీలక నేతలు ఏమయ్యారు? ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చే నాయకులు ఇప్పుడు కనిపించ కుండా పోయిన ఘటన వెనుక ఏం జరిగింది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే సహా పార్టీలోని కీలక నాయకులు ఇప్పుడు మౌనం ఎందుకు పాటించారు? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో తీవ్రస్థాయిలో జోరందుకున్న చర్చ. పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి అచ్చన్నాయుడిని ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయడం ఇంటి నుంచి తరలించడం తెలిసింది. దీనిపై అచ్చన్నకుటుంబం లబోదిబోమంది. కుటుంబ సభ్యులు మొత్తంగా మీడియా ముందుకు వచ్చి.. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు వెంటనే విసిరిన బీసీ కార్డు పెద్దగా పనిచేసినట్టు లేదని అంటున్నారు పరిశీలకులు. గత చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ వర్గం తరఫున మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. అదేసమయంలో టీడీపీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటానని చెప్పి.. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇప్పుడు పూర్తిగా మౌనం వహించారు. అదేసమయంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా మౌనం వహించారు. ఇక, అనంతపురం జిల్లాకుచెందిన బీసీ నాయకులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇక, పార్టీలో నెంబరు్ 2-3లుగా పేరున్న యనమల రామకృష్ణుడు కూడా ఎక్కడా మాట్లాడలేదు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు ఏం జరిగింది? అనేది కీలకంగా మారింది. దీనికి కారణం.. అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తర్వాత లోకేష్ చక్రం తిప్పగా.. ఆయన తర్వాత యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారు. అయితే, వీరితర్వాత తనంతట తానుగా అచ్చన్న చక్రం తిప్పారు. అంతా తనదే అన్నట్టుగా వ్యవహరించారు. దీంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు వద్ద.. అనేక సమయాల్లో తన ఆధిపత్య ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఇక, సమస్యలు వస్తే.. షార్ప్ షూటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయాస పడ్డారు. ఈ పోటీతో ఆయన ఇతర నేతలకు దూరమయ్యారనే వాదన ఉంది. ఇప్పుడు వారంతా .. మౌనం వహించారని అంటున్నారు.
ఇక,గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అంతా తానే అయి వ్యవహరిస్తున్నారనే వాదనను కూడా అచ్చన్న ఖండించలేదు. అదేసయమంలో చంద్రబాబు కూడా ఆయనకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, ఇటీవల విశాఖ ఎల్ జీ ఘటన విషయంలోనూ నియమించిన కమిటీకి అచ్చన్న నేతృత్వంలో నడిపించడం వంటివి పార్టీలోని సీనియర్లను కలచి వేసిందని, అందుకే వారంతాసైలెంట్ అయ్యారని అంటున్నారు. మరి ఇలాంటిసమయంలో ఈ సమస్యను బాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏదేమైనా.. నాయకులు ఇలా.. పార్టీ పరిస్థితి అలా ఉంటే.. మున్ముందు పరిస్థితి ఏంటనేది చూడాలి.