పవన్ తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక కామెంట్స్ చేసారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ నన్ను పార్టీ లోకి ఆహ్వానించారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను అని బాలినేని పేర్కొన్నారు. ఒంగోలు లోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతా. ఒంగోలులో నాతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారు. వైఎస్ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా. వైఎస్ఆర్ మరణానంతరం మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచా.. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీ లోకి వచ్చా.
నాతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చాం. మీకు జీవితాంతం మిమ్మల్ని గుర్తించుకుంటా అని జగన్ అన్నారు. విశ్వసనీయత అని ఎప్పుడు చెప్పే జగన్ ఆయన కోసం రాజీనామాలు చేసి వచ్చిన 17 మందిలో ఒక్కరికైనా మంత్రి పదవి కొనసాగించారా.. కానీ వైఎస్ మీద ప్రేమతో ఎన్ని ఇబ్బందులు అన్నా వైసీపీ లోనే ఉన్నా. గతంలోనే పవన్ వైసీపీ లో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలో చేరలేకపోయా. ఇప్పుడు ఏ డిమాండ్స్ లేకుండానే జనసేన పార్టీలో చేరుతున్నా. కూటమి నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అని బాలినేని పేర్కొన్నారు.