మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గవర్నర్ వ్యవస్థకు అనుకుంగా తెచ్చే ఆర్డినెన్సు కు రాజ్యసభలో మద్దతు కోసమే బిజెపి వివేకా కేసులో వైసీపీకి సహకరిస్తోందని ఆరోపించారు. అవినాష్ అరెస్టు లాంటి ఘటన తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో జరిగితే కేంద్ర బలగాలు దింపి అరెస్టులు చేసేవారని.. ఈ రాష్ట్రంలో సీబీఐ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
వివేకా హత్య కేసులో ఆలస్యానికి లోపాయికారి ఒప్పందాలు జరిగాయన్నారు నారాయణ. వివేకా కుమార్తె డాక్టర్ సునీత చొరవ వల్లే ఈ కేసు ఇంత దాకైనా వచ్చిందన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు బిజెపి, రెండో శత్రువు వైసిపి అని అన్నారు. రెండు వేల నోట్ల ఉపసంహరణ కేవలం అధికార పక్షం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డబ్బు అందుబాటులో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. లీగల్ గా మోడీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.