విఘ్నాయత్తులై మధ్యముల్: మూడు రాజధానులపై బొత్స ఫైనల్ పంచ్!

-

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

అని మనం ఇంతటి మంచి తెలుగు పద్యాన్ని ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ.. ఆ విషయాన్ని రుజువు చేయడంలో ఓ ధీరుడులా అడుగులు ముందుకు వేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ! గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి పేరుతో భ్రమరావతిని నిర్మించాలని కోట్ల రూపాయలను దండుకొని కమ్మరావతిగా కూడా మలచలేని వైనం వైసీపీ ప్రభుత్వానికి సువర్ణావకాశాన్ని అందించింది. వారి అసమర్ధ పాలన జగన్ పాలిట వరంగా మారింది!!

ఇక పద్యంలోకి వెళ్తే… మనం ఏదైనా పనికి పూనుకున్నప్పుడు దారిలో ఏమన్నా ఆటంకాలు ఎదురవుతాయేమో అన్న భయంతో అధములు అసలు పనినే మొదలుపెట్టరట. ఇక మధ్యములు ఏం చేస్తారంటే… పనిని మొదలుపెట్టినా.. మధ్యలో ఏవన్నా అడ్డంకులు ఎదురైతే ఆ వెంటనే పనిని సగంలో వదిలేసి పారిపోతారంట (చంద్రబాబులా అంటున్నారు). ఇక ధీరులైనవారు (వైఎస్ జగన్ అంటున్నారు) ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే… మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకూ రెట్టింపు ఉత్సాహంతో ద్విగుణీకృతం చేస్తూ పూర్తిచేసి తీరుతారు అనేది ఆ పద్యం సారాంశం.

ఇప్పుడు వర్తమానంలోకి వస్తే… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొత్స సత్యనారాయణకిచ్చిన టాస్క్ ఈనాటితో ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫైనల్ పంచ్ అన్నట్లు మూడు రాజధానులపై బొత్స తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రజల ముంగిట్లోకి పరిపాలన.. అభివృద్ధి వికేంద్రీకరణ.. కొత్తజిల్లాలు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్ధానాలని అన్నారు. మూడు రాజధానుల విషయంలో శాసన మండలి నిబంధనలకు వ్యతిరేకంగా చైర్మెన్ వ్యవహరించారని.. అయితే, రాయలసీమ.. అమరావతి.. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బొత్స స్పష్టం చేశారు.

అదేవిధంగా శాసనసభ అమరావతిలో కొనసాగించాలన్న నిర్ణయం గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు సంతోషించారని అలానే, కర్నూలు జిల్లా ప్రజలు చిరకాల కోరిక తీరిందని భావిస్తున్నారని చెప్పారు. ఇంకా చంద్రబాబు ఒక్క సామాజిక వర్గం కోసం రాజకీయం చేస్తున్నారన్న బొత్స.. నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దమాడుతున్నారని వివరించారు. “శివ రామ కృష్ణన్ కమిటీ” నివేదిక చూస్తే మూడు రాజధానుల అంశం కనిపిస్తోందని, అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ మూడు రాజధానుల విషయం ప్రస్తావించిందని.. కానీ.. చంద్రబాబు నాయుడు నియమించిన “నారాయణ కమిటీ” అమరావతిని సిఫార్స్ చేసిందని వివరించారు.

అంతేకాకుండా అమరావతి పేరుతో వేల కోట్లు వృధాకు చంద్రబాబు యత్నించారని, అమరావతి ప్రణాళిక ప్రకారం లక్ష కోట్లు వెచ్చించడం మొదలుపెడితే పూర్తయ్యేసరికి ఐదు లక్షల కోట్లు దాటిపోతుందని తెలిపారు. అంత డబ్బు వెచ్చించి సామర్థ్యం ఏపీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం 15వేల కోట్లు రాష్ట్రానికి వచ్చిందని.. అయితే అందులో రూ.7,500 కోట్లు మాత్రమే రాజధాని కోసం వెచ్చించారని, రాజధాని నిర్మాణానికి కేవలం ప్లాను కోసం అడ్వాన్స్ గా రూ.325 కోట్లు ఖర్చు చేశారని బొత్సం క్లారిటీ ఇచ్చారు.

అంతటితో ఆగకుండా రూ.1300 కోట్లు ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చినట్టు లెక్కలో తెలుతుందని.. అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా గతంలో రాజధాని కోసం వృధా చేసిన ధనంపై ఇప్పుడు ప్రజల ముందు ఉంచాలని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని, ప్రజల అభిప్రాయం మేరకే శాసన సభ.. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటుకు లక్షల కోట్లు అవసరం లేదని.. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని బొత్స పైనల్ పంచ్ ఇచ్చారు. ఇది క్లియర్ అని స్పష్టం చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news