రాజకీయాల్లో ఎవరికి ఎవరూ కారనేది అందరికీ తెలిసిందే. అన్నకుతమ్ముడు, భార్యకు భర్త కూడా దూరమే. ఎవరి రాజకీయాలు వారివి. ఇప్పటికే భార్య ఒక పార్టీలో భర్త మరోపార్టీలో, తండ్రి ఒక పార్టీలో కూతురు మరోపార్టీలో చక్రాలు తిప్పిన పరిస్థితి మన దగ్గరే ఉంది. సో.. బంధుత్వాల దారిది బంధుత్వాలదే.. రాజకీయాల దారిది రాజకీయాలదే! ఇప్పుడు ప్రకాశంలోనూ ఇదే తరహా రాజకీయాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా అన్నదమ్ములు.. ఇద్దరూ కలిసే రాజకీయాలు చేశారు. తమ్ముడు ఎమ్మెల్యే అయితే, చక్రం అన్నగారు తిప్పేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా.. అన్నే అన్నీ అయి రాజకీయాలు చేశారు.
వారే ఆమంచి సోదరులు. ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు. ఈ ఇద్దరూ కూడా రాజకీయాల్లో రామలక్ష్మణుల మాదిరిగా చక్రాలు తిప్పారు. గతంలో వరుస విజయాలు సాధించిన కృష్ణమోహన్‌కు తెరవెనుక అన్నీ తానై వ్యవహరించారు స్వాములు. ఈ క్రమంలో తమ్ముడి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటనలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంతసేపూ తమ్ముడు రాజకీయాలు చేస్తే.. నేను చూస్తూ ఊరుకోవడమేనా? అనే ఆలోచన వచ్చిందేమో.. స్వాములు దూకుడు పెంచారని అంటున్నారుజిల్లా నేతలు. ఇప్పుడు ఈ విషయమే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో ఉన్న అన్నదమ్ములు సవాళ్లకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆమంచిని చీరాల నుంచి పరుచూరుకు వెళ్లి ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టాలని ఏకంగా జగన్ నుంచే సమాచారం అందింది. వెంటనే అక్కడ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే, కమ్మ కోటరీగా ఉన్న పరుచూరులో నేనెళ్లి ఎలా రాజకీయాలు చేస్తానని కృష్ణమోహన్ భీష్మించారు. కానీ, ఇంతకు మించి నీకు అవకాశం లేదనే సంకేతాలు కూడా వెళ్లాయి. అయినప్పటికీ.. కృష్ణమోహన్ మాత్రం తన పట్టును మార్చుకోలేదు. ఇస్తే.. చీరాలనే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇది జరుగుతుండగానేస్వాములు చక్రం తిప్పారు. పరుచూరులో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు వేయించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. “జననేత స్వాములుకు స్వాగతం“ అంటూ.. పరుచూరు వైఎస్సార్ సీపీ నేతలతో ఆయన భారీ పోస్టర్లు పెట్టించుకున్నారు.
అంతేకాదు, మావోడు వెళ్లకపోతే.. ఫర్లేదు.. నన్ను వెళ్లమంటారా? అంటూ.. ఆయన వర్తమానాలు పంపిస్తున్నారట. దీనిపై వైఎస్సార్ సీపీ అధిష్టానం ఏమీ తేల్చలేదు. ఇది తేలితే.. తాను వెళ్లి.. పరుచూరులో వైఎస్సార్ సీపీ తరఫున చక్రం తిప్పుతానని అంటున్నారు స్వాములు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి నిన్నటి వరకు కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య పరుచూరు చిచ్చు రేపిందని అంటున్నారు పరిశీలకులు.