పీసీసీ అధ్యక్షుడి ఎన్నికను కాంగ్రెస్ అధిష్ఠానం వాయిదా వేయడం వెనుక బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అదేమంటే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఎదురులేని శక్తిగా ఉన్నాడు. కేసీఆర్‌ను ఢీకొట్టే చాతుర్యం…చాణక్యం కలిగిన నాయకుడు ప్రస్తుత కాంగ్రెస్‌లో అంజనమేసి గాలించినా దొరకడం లేదని సమాచారం. అయితే కనీసం అధిష్ఠానం ఆలోచనలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసే నాయకుడి కోసం వెతకాలనే నిర్ణయంతో సోనియాగాంధీ ఉన్నట్లు సమాచారం. అందుకే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆచితూచిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానానికి నమ్మిన బట్టుగా ఉండాలని సోనియా యోచిస్తున్నారట.
అలాగే వర్గ రాజకీయాలకు దూరంగా ఉండి…అతివాద లక్షణాలు కలిగిన నేతగా కాకుండా.. సొంత ఇమేజ్‌ను పార్టీపై రుద్దకుండా ఉండే నేత కావాలని భావిస్తున్నారట. అయితే సోనియా యోచిస్తున్న ప్రకారం…. మళ్లీ ఆమె వృద్ధ నాయకత్వం వైపు మొగ్గు చూపే ఆలోచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. వాస్తానికి కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీరిద్దిరిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కినట్లేనని అంతా భావించారు. ఇప్పటికీ కూడా కొంతమంది అదే మాటకు కట్టుబడి ఉన్నారు.
ఉత్తమ్ మాత్రం ఈ ఇద్దరిలో ఎవరూ కాకుండా కొత్త వ్యక్తిని అధిష్ఠానానికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ కొత్త పేరు ఎవరిదై ఉంటుందన్నది పెద్ద ప్రశ్న అనే చెప్పాలి. అయితే వీరిద్దరు కాకుండా జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్లు మొదట వినబడ్డాయి. అయితే అనుభవం ఉన్న నేతలనే ఎంపిక చేస్తారన్న ప్రచారం తెరపైకి రావడంతో వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో పొన్నాల లక్ష్మయ్యకు గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్సార్ కేబినేట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కూడా. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నారు.
అలాగే మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో పొన్నాలకు అవకాశాలు మెండుగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే కాంగ్రెస్ అంటేనే రెడ్డి సామాజిక వర్గంగా ముద్రపడిన నేపథ్యంలో రెడ్లను పొన్నాల మ్యానేజ్ చేయగలడా అన్న సందేహాస్పదాలు కూడా అప్పుడే పార్టీలో మొదలు కావడం గమనార్హం. చూడాలి మరి అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవికి ఇంకెన్నాళ్లు సమయం తీసుకుని ఎవరిని ఎంపిక చేస్తుందో..?!