కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా వెళ్లడం లేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరీతోనే స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తనను వైసీపీ నుంచి బహిష్కరించినా.. ఎమ్మెల్యేగా తనను ఎవ్వరూ తొలగించలేరన్నారు.
తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ ను అనేక మార్లు కలిశానని, వినతి పత్రాలకు కూడా అందజేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై చేసిన ఆరోపణలను ఎవ్వరూ నిరూపించలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతీ హామీని పూర్తి చేసి తీరుతానని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు.