విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో అన్నారు. ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారన్న చంద్రబాబు.. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని.. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో 93 శాతం గెలవడం దేశ చరిత్రలో అరుదైన అనుభవం అని అన్నారు.