రూ.2వేల వరద సాయం.. బురద కడిగేందుకూ సరిపోవు : చంద్రబాబు

-

ఏపీలో వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతకాదంటూ చేతులెత్తేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గత వారం ముంపు ప్రాంతాల్లో పర్యటించానని.. సీఎం హోదాలో తాను పర్యటించకపోతే ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతో విధిలేని పరిస్థితుల్లో జగన్ పర్యటించారని విమర్శించారు. ఇప్పుడైనా తిరగకపోతే ప్రజలు తిరగబడతారనే భయంతోనే నిన్న జగన్‌ పర్యటించారన్నారు. పరదాలు, బారికేడ్లు చాటునే సీఎం పర్యటన సాగిందని ఎద్దేవా చేశారు.

తాను కష్టాల్లో ఉంటే పాదయాత్ర చేసిన జగన్‌.. ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముంచేశాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ముంపు బాధితులకు రూ.2వేల కోట్ల పరిహారమైతే ఇస్తానని.. మొత్తం తన వల్ల కాదని జగన్‌ చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. గోదావరిలో కొట్టుకుపోయే పశువుల్ని కూడా సీఎం కాపాడలేదని మండిపడ్డారు. ఏలూరులోని బొండ్లబోరు, శివకాశీపురం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు.

ప్రతిపక్షనేతగా డ్రామాలాడిన వ్యక్తికి, అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు వరద బురద కడిగేందుకు కూడా సరిపోవని మండిపడ్డారు. ప్రజలు గోదావరిలో మునిగిపోతే సీఎం ఆకాశంలో తిరుగుతాడా అని వ్యాఖ్యానించారు. పోలవరం కట్టలేనని చేతులెత్తేశాడని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని చంద్రబాబు తెలిపారు. ముంపు బాధితులందర్నీ కచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం కాంటూర్‌ లెవల్‌ 41.15 వరకు మాత్రమే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్‌ లెవల్‌ 45.75 వరకు ప్యాకేజీ ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఆశ్రమ పాఠశాలే ఇప్పుడు వరద బాధితులకు సహాయ శిబిరంగా మారిందని చంద్రబాబు అన్నారు. చేతనైతే తెదేపా అధికారంలో ఉండగా వరద బాధితుల కోసం తెచ్చిన సాయం జీవోను మెరుగుపరచాలని సూచించారు. అంతేకానీ పరిహారం తగ్గించడం తగదని చంద్రబాబు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news