వరద బాధితులకు సాయం చేయకపోగా.. బెదిరింపులా?: చంద్రబాబు

గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి, వాళ్ల కష్టాలను తనతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో తాను పర్యటించినప్పుడు వరద సాయం అందలేదని తమతో చెప్పుకున్న బాధిత మహిళలను.. పునరావాసం కేంద్రం నుంచి వెళ్లగొట్టడం.. పైగా బెదిరించడం దారుణమన్నారు.
వైకాపా నేతల క్రూరత్వం తెలిసిందేనన్న ఆయన.. రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మనమేమన్నా ఆటవికయుగంలో ఉన్నామా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకున్నందుకు ప్రతీకారచర్యలా అని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోకుండా తప్పుచేసింది వైకాపా నేతలు కాదా? అని ప్రశ్నించారు. వైకాపా నేతల శాడిజాన్ని ఖండించిన చంద్రబాబు.. బాధితులకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు.
‘వైసీపీ నేతల క్రూరత్వం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనమేమన్నా ఆటవికయుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకున్నందుకు ప్రతీకారచర్యలా? ప్రజలను ఆదుకోకుండా తప్పుచేసింది మీరు కాదా? వైసీపీ నేతల ఈ శాడిజాన్ని నేను ఖండిస్తున్నాను. ‘అని చంద్రబాబు మండిపడ్డారు.