ఇంతకాలం అమరావతి విషయంలో చేతకాక, చేవలేక అన్నట్లుగా ఆన్ లైన్ పోరాటాలకు మాత్రమే పరిమితమయిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కొత్త ధైర్యం వచ్చింది. అలా వచ్చిన ఆ ధైర్యంతో రాజినామాలు చేసి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఇంతకూ బాబు & కోలకు ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దానికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలా వద్దా అన్నఅంశంపై తెలుగుదేశం పార్టీ ఆన్ లైన్ సర్వే ఒకటి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సర్వేను ప్రారంభించిన ఆరు రోజుల్లో 3.81 లక్షల మంది తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ ప్రజలు కోరుకొంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 95శాతం మంది అమరావతి కొనసాగింపునే కోరారని టీడీపీ నేతలు చెబుతున్నారు!
దీంతో… చంద్రబాబుకు కొత్త ధైర్యం వచ్చినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు! సర్వేలో 95శాతం ఓట్లు అనుకూలంగా రావడం అనేది చిన్న విషయం కాదు. టీడీపీ నేతలు అంత బలంగా చెబుతున్న ఈ ఫలితాలు వాస్తవాలే అయితే… బాబుకు ఇంతకు మించిన సువర్ణావకాశం మరొకటి ఉండదు. అంతగా మెజారిటీ ప్రజలు అమరావతివైపు మొగ్గు చూపుతున్నప్పుడు బాబు ఇంక ఆలస్యం చేయడం తగదు అని ఈ సందర్భంగా తమ్ముళ్లు కోరుకుంటున్నారు!
అయితే… ఈ సర్వేలో ఏ ప్రాంతం నుంచి ఎంతమంది పాల్గొన్నారు.. ఆ సర్వేలో ఉన్న మిగతా వివరాలు వెళ్లడించాల్సి ఉంది. ఆ వివరాల్లోని వాస్తవాలు అన్నీ టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా వాస్తవాలే అయితే మాత్రం… ఇక అమరావతి విషయంలో బాబు హీరో అయ్యే అవ్కాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా కాకుండా అది వాస్తవానికి దూరమైన సర్వే అయితే మాత్రం… ఇలా కాలం గడిపేయడమే బాబు ముందున్న ఆప్షన్!