టిడిపి అధినేత చంద్రబాబు కుడికంటికి కాటరాక్ట్ సర్జరీ చేయాలని వైద్యులు తాజాగా తేల్చారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి తెలిసింది. ఈనెల 25న ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన కుడి కంటిలో శుక్లాం ఉందని, సర్జరీ చేయాలని పేర్కొంటూ ఓ నివేదికను జైలు అధికారులకు సమర్పించారు.
ఈ ఏడాది జూన్ లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరగడం గమనార్హం. కాగా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 25న ఆయన లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఆయన లేఖను పంపారు. తన భద్రతపై అనేక అనుమానాలున్నాయని చంద్రబాబు తాను రాసిన లేఖలో వ్యక్తం చేశారు. అయితే.. చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు.