సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా బాబు!

-

ఈ రెండు నెలలు పార్టీ పరిస్థితి ఏదైతేనేమి.. బాబుని నమ్ముకున్న కార్యకర్తలు, కొంతమంది ప్రజల పరిస్థితి ఏమైతేనేమి.. అవన్నీ కాసేపు పక్కన పెడితే చంద్రబాబు సుధీర్ఘ విశ్రాంతి అనంతరం ఏపీ డీజీపీ అనుమతితో ఆరోగ్యంగా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు! ఇలా హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకునే క్రమంలో సంపూర్ణంగా లాక్ డౌన్ నిబంధనలు తుంగలోకి తొక్కారు! సరే… కరోనాపై చంద్రబాబుకి ఉన్న అవగాహన అది అని కొందరంటే… బాబుపై ఈ సందర్భంగా ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు అని మరికొందరు అభిప్రాయపడ్డారు! ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు బాబు విశాఖ టూర్ పై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో బాబు బాధ్యతను కూడా పలువురు గుర్తుచేస్తున్నారు!

అంతా అనుకూలంగా జరిగితే ఈపాటికి బాబు విశాఖ వెళ్లి కాసేపు ఉండి.. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అమరావతికి వెళ్లేవారు! కర్ఫ్యూ సమయంలో తిరగకూడదనే రూల్ ఉన్నా కూడా ప్రత్యేక అనుమతులతో చీకటి పడినా కూడా ఇంటికి వెళ్లేవారు! కానీ… రాష్ట్రం అనుమతి ఇచ్చినా కూడా కేంద్రం విమానాల రద్దు రూపంలో ఆ ప్లాన్ అంతా మారిపోయింది. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు విశాఖలో పర్యటించడం అవసరమా? అనే ప్రశ్నలు తాజాగా వస్తున్నాయి. అలా అని అవేవో రాజకీయ ప్రశ్నలు అనుకునేరు.. అందులో ఎంతో అర్ధవంతమైన ఆలోచన దాగిఉంది!

ఇంతకాలం అజ్ఞాతంలో ఉండటం వల్ల… బాబు విశాఖ పర్యటనను రాజకీయ పర్యటనగా భారీ స్థాయిలో ప్లాన్ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారట! ఈ సమయంలో బాబు విశాఖకు వెళ్తే… మందీమార్బలంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది! అదే ఇప్పుడు ప్రజలందరి టెన్షన్ గా ఉంది! హైదరాబాద్ నుంచి అమరావతికి బాబు సైలంట్ గా… బాధ్యతాయుతమైన వ్యక్తిగా హడావిడి లేకుండా, రోడ్లపై లాక్ డౌన్ నిబందనలు తుంగలోకి తొక్కకుండా వస్తే… ఈ అనుమానాలు వచ్చేవి కావు కానీ… బాబు తాజా హడావిడితో ఈ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో.. నిజంగా బాబు విశాఖ వెళ్తే… అక్కడికి భారీగా పోగైన కార్యకర్తల్లో ఏ ఒక్కరికైనా వైరస్ ఉంటే… ప్రస్తుతం ఈ భయాలే పలువురు వ్యక్తపరుస్తున్నారు!

ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటన విరమించుకుని ఇంటికే పరిమితం కావాలని పలువురు సూచిస్తున్నారు. 60 ఏళ్లకు పైగా వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ సమయంలో ఆరుబయట తిరిగితే ఆయన ఆరోగ్యానికే ప్రమాదం ఉందని మరికొందరు అభిమానులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో పబ్లిసిటీ రాజకీయాలు పక్కనపెట్టి… 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ వయసులో అయినా కేవలం తన ఆరోగ్యం కోసమే కాకుండా.. సమాజ ఆరోగ్యం కోసం కూడా ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. మరి ఈ సమయంలో ఇంతకాలం కరోనా పేరున తన ఆరోగ్యం పట్ల బాబు చూపించిన శ్రద్ధ.. సమాజ ఆరోగ్యం పట్ల కూడా చూపిస్తారా? లేక రాజకీయాలే తనకు ముఖ్యం కానీ ప్రజలు, వారి ఆరోగ్యాలు ఏమైతే ఏమిటి అని విశాఖకు బయలుదేరతారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news