ఏపీలో అధికార వైసీపీ నేతల్లో రాజకీయ రగడ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతోంది. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు.. పాత వర్సెస్ కొత్త నేతల మధ్య వార్ నడుస్తోంది. ఎవరికి వారు ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండడంతో ప్రచ్ఛన్న యుద్ధాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ జగన్‌కు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ నుంచి 2009లో కాంగ్రెస్ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిన ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.
ఆర్థిక కారణాలు లేదా కుటుంబ వ్యవహారాల వల్ల ఆయన తాను పోటీ చేయలేనని జగన్‌కు చెప్పడంతో జగన్ ఎన్నికలకు ముందు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సీటు ఇచ్చారు. ఆయన వైసీపీ ప్రభంజనంలో ఘనవిజయం సాధించారు. అయితే ఇప్పుడు వేణు వర్సెస్ శివప్రసాద్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. బూచేపల్లికి దర్శి మంచి పట్టున్న ప్రాంతం.. అక్కడ నుంచి ఆయన తండ్రి 2004లో ఇండిపెండెంట్‌గా కూడా గెలిచారు. ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న శివప్రసాద్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో తన అనుచరులను ఏకం చేసి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధి పనుల నుంచి బదిలీల వరకు అన్ని తన కనుసన్నల్లోనే జరగాలని ఆయన పట్టుబడుతున్నారట. ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడిన నేత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా బోడి పెత్తనం చేయడం ఏంటని ఎమ్మెల్యే వేణుగోపాల్ ఫైర్ అవుతున్నారు. ఆ ఇద్దరు నేతలు పోటీగా మీడియా సమావేశాలు పెట్టుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ది పనుల టెండర్లను దక్కించుకునేందుకు కూడా ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇటీవల శివప్రసాద్ జోక్యంపై ఎమ్మెల్యే సీఎంకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక ఇటీవల ఎమ్మెల్యే ఫ్లెక్సీలను కూడా ఇటీవల చించివేయడంతో రగడ రోడ్డున పడింది.
ఇక జిల్లాకే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. శివప్రసాద్‌కు జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా దర్శి వైసీపీ పరిస్థితి తయారైంది.