నోరు జారిన డిప్యూటీ సీఎం..అవకాశంగా మలుచుకున్న ప్రతిపక్షం…!

-

డిప్యూటీ సీఎం నోరు జారారు. అవతలివాళ్లు దాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్ వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. దీంతో అధికారపార్టీ నేతలు ఏం మాట్లాడినా ప్రెస్ మీట్లకే పరిమితమైపోయిన తెలుగు తమ్ముళ్లు కూడా ట్రెండ్ మార్చారు. దాడికి ప్రతిదాడే సరైన సమాధానం అనేలా మూకుమ్ముడిగా ఏకమై రోడ్డెక్కేశారు.

నిన్న మొన్నటి వరకూ చిన్నా చితకా విమర్శలతో విమర్శలతో సరిపెట్టేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. కానీ, ఓ మెట్టుదిగిన ఆయన సినిమా రేంజ్ లో డైలాగ్ కొట్టారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలని భావించారు. అటు టీడీపీ అధినేతను , ఇటు శ్రీకాకుళం జిల్లా తమ్ముళ్ల పై ఎక్కుపెట్టిన కృష్ణదాస్ పెట్టిన మాటల గురి తప్పింది. చంద్రబాబు పై ఆయన చేసిన కామెంట్లతో సిక్కోలులో అగ్గి రాజేసిందనే టాక్ వినిపిస్తోంది.

సొంత నియోజకవర్గం నరసన్నపేటలో దేశవాని పేటలో జలకళ పథకంతో పాటు, రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన మీటింగ్ లో డిఫ్యూటీ సీఎం కృష్ణదాస్ నోరుజారారు.కార్యకర్తల్లో జోష్ నింపుతూ మాట్లాడుతున్న ఆయన స్పీచ్ లో దొర్లిన పదాలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ఐతే తాను చేసిన వ్యాఖ్యను కృష్ణదాస్ సవరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పాపాత్ముల గురించి మాట్లాడుతుంటే నోరు అదుపుతప్పుతోందంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు . దీంతో కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యల పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ ఏడాది కాలంగా సైలెంట్ గా ఉండిపోయిన తెలుగుతమ్ముళ్లకు దాసన్న మాటలు మంచి అవకాశంగా మారాయని భావిస్తున్నారట. తమ అధినేతను అంత మాట అంటారా అంటూ ఏకమైతున్నారట. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఏదో ఒకరిద్దరు మాత్రమే రోడ్డెక్కి నిరసన తెలిపారు. కానీ, ఇప్పుడు, డిఫ్యూటీ సీఎం చేసిన కామెంట్స్ తో రంగంలోకి దిగిపోయారు . పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడి వరకూ అంతా కట్టకట్టుకుని కృష్ణదాస్ వ్యాఖ్యలను ఖండించటమే కాదు.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

మొత్తంగా కృష్ణదాస్ వ్యాఖ్యలతో సిక్కోలులో రాజకీయం మరింత రగిలేలా కనిపిస్తోంది. అధికారపార్టీ మాటలతో దాడి చేస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేయటమే దీనికి నిదర్శనం అనే చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news