తూర్పు కాపుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారని.. కానీ 45 లక్షల మంది తూర్పు కాపులున్నారని అన్నారు. ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలని చెబుతోందని ప్రశ్నించారు. పథకాలు అందకుండా చేయడానికి వైసీపీ అలా అంటోందని విమర్శించారు.
జనసేన అధికారంలోకి వస్తే తూర్పుకాపుల జనగణన చేపడతామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగితే కులాలతో సంబంధం లేదని.. చట్టం పనిచేయనప్పుడు కులాల వైపు చూస్తామని అన్నారు. తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారు తిన్నాకైనా వారి కులం గురించైనా ఆలోచించాలన్నారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు.. తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏమిటని నిలదీశారు.
తెలంగాణలో 31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పుకాపులను తొలగించారని ఆరోపించారు. అయినా అప్పటి నాయకులు పట్టించుకోలేదని.. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలన్నారు. బీసీ కులాల జనగణనకు అనుకూలంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం అవ్వడం అన్నింటికీ మంత్రదండం కాదని.. నేను సీఎం అయిన తరువాత చేయాలనుకున్నా అధికారులో, నాయకులో అడ్డుపడతారని అన్నారు పవన్ కళ్యాణ్. చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. తాను సీఎం అయినా నన్ను నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు.