హైకోర్టులో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండటానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జస్టిస్ నరేంద్ర, జస్టిస్ న్యాపతిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్ళుగా స్టీల్ ప్లాంటు అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని కేఏ పాల్ అన్నారు. ప్రైవేటీకరణ పేరిట విశాఖ స్టీలు ప్లాంట్ ను అమ్మవద్దని.. 8వేల కోట్లు ఇస్తానని చెప్పానన్నారు.
ఇవాళ హైకోర్టు తీర్పు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నమ్మిన వారికి మంచి రోజన్నారు. స్టీలు ప్లాంటు నష్టాల్లో లేదని, భూమి సగం అమ్మేసారని, అనుమతిస్తే ముప్పై రోజుల్లో 8వేల కోట్లు ఇస్తాను అని తెలిపానన్నారు. 16వేల ఎకరాలు మాత్రమే స్టీలు ప్లాంటు స్థలం మిగిలిందని.. స్టీలు ప్లాంటు నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని కేఏ పాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సంవత్సరానికి లక్ష కోట్ల అప్పు.. బీజేపీ పాలనలో నెలకి లక్ష కోట్ల అప్పు చేశారన్నారు. మార్చి 14న కౌంటర్ వేయకపోతే హైకోర్టు ఆదేశాలు ఇస్తామని చెప్పిందని ఈ సందర్భంగా వివరించారు.