వల్లభనేని వంశీ వైసీపీలో కుదురుకోవటం కష్టమేనా…?

-

టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జైకొట్టిన దగ్గర నుంచి వరుస వివాదాలతో తలబొప్పి కడుతోందట.గన్నవరంలో ఆ పార్టీ నేతల నుంచి సరైన సహకారం అందకపోవటంతోపాటు వర్గపోరు మరింత ఇబ్బంది పెడుతోందట.దూకుడు తగ్గించి వైసీపీలో సహనంగా ఉంటున్నా, ఆల్రెడీ ఉన్న వర్గాలతో కుమ్ములాటలు ఇరుకున పెడుతున్నాయట.ఈ పరిస్థితలో వైసీపీలో వంశీ కుదురుకోవటం అంత ఈజీగా కాదనే టాక్ వినిపిస్తోంది.

వల్లభనేని వంశీ మూడు ఎన్నికలు చూసిన అనుభవం ఉన్న నేత. పార్లమెంటుకు ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు వంశీ పోటీచేశారు. పార్లమెంటు స్థానానికి ఓడిపోయిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చూపించారు. పదేళ్ళపైన టీడీపీ నేతగా ఉన్న వంశీ ప్రస్తుతం కొత్త పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఉన్నంత కాలం గన్నవరం నియోజకవర్గంలో పట్టుసాధించటంలో సక్సెస్ అయ్యారు. దాసరి సోదరులను సైతం పక్కన పెట్టి తనకే సీటు ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పించారు. ఇప్పుడు వైసీపీకి జై కొట్టినప్పటి నుంచి మాత్రం కొత్త పరిస్థితులను వంశీ ఎదుర్కొంటున్నారట.

వంశీది సహజంగానే దూకుడు స్వభావం. తొలుత ఆయన ఎంపీగా పోటీ చేసే సమయంలో కూడా కృష్ణాజిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో సైతం వంశీ సై అంటే సై అని మాటల యుద్దం జరిగేది. అప్పటి బెజవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన ప్రస్తుత ఏసీబీ డీజీ సీతారామాంజనేయులతో కూడా వంశీ కొన్ని విషయాల్లో ఢీకొట్టారు. దూకుడుగా ఉన్నా, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళే వంశీకి ప్రస్తుతం వైసీపీలో మాత్రం అలా జరగటంలేదు. దూకుడు పక్కన పెట్టి వైసీపీలోని అన్ని వర్గాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనా కాలం కలిసి రావటంలేదట. వరుస వివాదాలతో వంశీకి తలబొప్పి కడుతున్న పరిస్థితి ప్రస్తుతం గన్నవరం వైసీపీలో నెలకొంది.

టీడీపీలో పదేళ్ళపాటు పనిచేసిన వంశీ అక్కడ ఉన్నంత కాలం తన మాట నెగ్గించుకోవటానికి ఎత్తులు పై ఎత్తులు వేశారు. వైసీపీకి జై కొట్టిన సమయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నేతలందరిపై విరుచుకుపడి టీడీపీ నేతల నోళ్ళు మూయించారు వంశీ. టీడీపీ నేతలు కూడా ఒకదశలో వంశీ పై విమర్శలు చేయటానికి ఆలోచనలో పడ్డ పరిస్థితి. అయితే వైసీపీలో మాత్రం వంశీకి అలాంటి పరిస్థితి లేదు. తొలుత యార్లగడ్డ వెంకట్రావు వర్గంతో తలపడిన వంశీ ఇప్పుడు దుట్టా రామచంద్రరావు వర్గంతో పోరాటం చేస్తున్నారు. వైసీపీ కొత్త కావటం, ఇప్పటి వరకు ఉన్న వైసీపీ నేతలపై ఏకపక్షంగా వెళితే తనకే నెగిటివ్ అవుతుందనే వంశీ దూకుడు తగ్గించారట. సహనంగా ఉంటున్నప్పటికీ ఇతర వర్గాలతో ఆయన పోరు తప్పని పరిస్థితి ఏర్పడుతోందని టాక్.

అటు దుట్టా వర్గం, యార్లగడ్డ వర్గం కలిసి వంశీతో పోరుకి దిగటంతో వంశీ ప్రస్తుతం సహనంగా ఉంటూనే సత్తా చూపే ప్రయత్నం చేస్తున్నారట.అయితే టీడీపీలో మాదిరిగా వంశీకి వైసీపీలో కుదురుకోవటం అంతా ఈజీ అవుతుందా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ వర్థంతి సమయంలో వంశీతో కలిసి రాకుండా దుట్టా తన వర్గీయులతో కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. మంత్రి కొడాలి నాని కొన్ని కార్యక్రమాలు నిర్వహించటానికి గన్నవరం వచ్చినా దుట్టా మాత్రం దూరంగానే ఉన్నారు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులపై వంశీ అనుచరులు దాడి చేశారన్న ఆరోపణలు వచ్చినపుడు యార్లగడ్డకు దుట్టా సంఘీభావం తెలిపారు.

ఇక రైతు భరోసా కేంద్రాల శంకుస్థాపన సందర్భంగా వంశీ ఎదురుగానే దుట్టా, వంశీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. దుట్టా, ఎమ్మెల్యే వంశీలు కూడా ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళారు. అధిష్టానం ఇరువురు మధ్య సయోధ్య చేసే ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. దీంతో వంశీకి వైసీపీలో కుదురుకోవటం అంత ఈజీగా కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news