జగన్ ఇంటి బాత్రూంపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదవాడి ఇంటికంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దదని… మీది పైత్యం.. మాది పారదర్శకత అంటూ X(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి “గంటా శ్రీనివాసరావు” ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తులను మనం కేవలం కష్టోడియన్లం అనే వాస్తవాన్ని గ్రహించనంత వరకు ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కాలేదు.
అవసరం ఉన్న చోట పనులు చేపట్టకపోవడం ఎంత బాధ్యతా రాహిత్యమో, అవసరం లేని చోట వందల కోట్లు దుబారా కూడా అంతే బాధ్యతా రాహిత్యం. పేదవాడికి మీరు కట్టించిన ఇంటి విస్తీర్ణం కంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తన నివాసం కోసం విశాఖలో 10 ఎకరాలు, 450 కోట్లు కావాల్సి వచ్చిందని నిప్పులు చెరిగారు.
దీని కోసం వందల మంది స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్న హరిత రిసార్ట్స్ ను వారం రోజుల్లో నేల మట్టం చేశారు. అసలేం కడుతున్నారో చెప్పకుండా ఎందుకు గోప్యత పాటించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రుషికొండ వస్తే ఎందుకు అడ్డుకున్నారు? 91 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించారు. తీరా చూస్తే కట్టడాలు కూల్చడానికి, మట్టి తవ్వకానికే 95 కోట్లు ఖర్చు చేశామని లెక్క రాశారు. ఆ 95 కోట్ల నిర్మాణ వ్యయాన్ని కూడా చివరకు 460 కోట్లకు ఎలా పెంచేశారు? ఇవన్నీ దాచేసి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడుతున్నారని ఆగ్రహించారు.