ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ఇటీవలే మధ్యప్రదేశ్, తమిళనాడులోనూ రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
విశాఖ- లింగంపల్లి(12805)-జన్మభూమి, విశాఖ-విజయవాడ (22701)-ఉదయ్, విశాఖ-గుంటూరు(17240)- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇవాళ రద్దు చేశారు. అదే రైళ్ల తిరుగు ప్రయాణం కూడా రద్దయింది. విశాఖ- సికింద్రాబాద్ (20833)-వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా వెళ్లనుంది. విశాఖ నుంచి ఉదయం 5.45కి బయల్దేరాల్సిన వందేభారత్.. 8.45కి బయల్దేరనుంది. ఇవే కాకుండా విశాఖతోపాటు దువ్వాడ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.