భారీ వర్షాలు ఏపీని కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరాన్ని తాకకముందే ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది తుఫాన్. ముఖ్యంగా కృష్ణాజిల్లా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నపు బట్టి సెంటర్ వద్ద ఈరోజు ఉదయం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ ఘటనలో మరి కొంతమంది శిధిలాల కింద చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మీలుగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియ రాలేదు.
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచెరియలు విరిగిపడ్డ సమీపంలోని ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇక ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది ప్రభుత్వం.