మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత

ఉద్దండరాయునిపాలెంలో మోడీ శంకుస్థాపన ప్రాంతానికి రైతులు వేలాదిగా తరలొచ్చారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి నేటికీ సరిగ్గా ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా అమరావతి చూపు..మోడీ వైపు అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు రైతులు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు రాజధాని రైతులు. అయితే ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి మద్దతుదారులు సభ ఏర్పాటు చేయగా ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు పేరుతో అక్కడకు దళిత బహుజన ఫ్రంట్ నేతలు చేరుకున్నారు. అడ్డుకున్న పోలీసులును సైతం నెట్టేసి సభ జరుగుతున్న వద్దకు వచ్చారు ప్రతినిధులు.

జై అమరావతి, అంటూ రైతులు మూడు రాజధానులు ముద్దు అంటూ ఈ దళిత బహుజన ఫ్రంట్ నేతలు మరోవైపు నినాదాలు చేస్తున్నారు. ముందు అడ్డుకున్నా ఆ తరువాత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకుండా సభ అయ్యే వరకు వేచి ఉన్నారు పోలీసులు. ఇక దళిత పరిరక్షణ సమితి నేతలు మాట్లాడుతూ మంచి రాజధానికి సహకరించాలని ఆనాడు మోడీ ఇక్కడ శంకుస్థాపన చేశారని, ఆ తరువాత చంద్రబాబు మోసాలు తెలిసి… నిధులు నిలిపివేశారని అన్నారు. చంద్రబాబు అతని సామాజిక వర్గానికి చెందిన‌ వారికి వందల ఎకరాలు కట్టబెట్టారని, దళితుల భూములు లాక్కుని.. పరిహారం ఇవ్వలేదని ఆరిపించారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి ని వ్యతిరేకించడం లేదని, మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం తో పాటు.. ఉత్తరాల, రాయలసీమ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షించారని వారు చెప్పుకొచ్చారు.