ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు’ పథకంలో భాగంగా చేపట్టే ఇళ్ళ నిర్మాణాల్లో ఉగాది నాటికి ఐదు లక్షలు పూర్తి కావాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. అదే రోజు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలన్నారు. విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.
ప్రతి జిల్లాలోనూ లక్ష్యాలను నిర్దేశించుకుని 100% పూర్తి చేయాలి. ఒకే రోజు ఐదు లక్షల గృహప్రవేశాలు చేయించడం ద్వారా దేశంలోనే ప్రత్యేకంగా నిలవాలి. ఈ లక్ష్యసాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలి. ఇందులో బాగా పనిచేసే ఉద్యోగులకు అవార్డులు, అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఈ పథకంలో ప్రజాప్రతినిధుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తాం. సర్పంచి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారని తెలిపారు.