ఎన్డీఏలో వైసీపీ చేరికకు ప్రధాన అడ్డంకి ఇదే…!

-

ఏపీ సీఎం వైఎస్ జగన్‌.. ప్రధాని మోడీ మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చ జరిగింది? ఎన్డీఏలో వైసీపీ చేరుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా తేలేవరకు వైసీపీ కేంద్ర కేబినెట్‌లో చేరడం కష్టమేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్రంలో బీజేపీ వైసీపీ కూడా ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన లేదని కూడా చెబుతున్నాయి.

15రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీవెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ప్రధానితో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, విభజన హామీలు సహా 17 అంశాలపై ప్రధాన మంత్రి మోడీకి.. ముఖ్యమంత్రి నివేదించారు. రాజధాని విషయంలో తలెత్తుతున్న ఆటంకాలపైనా చర్చించారని సమాచారం.

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతులివ్వడంతో పాటు.. ఎన్డీఏలో వైసీసీ చేరడంపైనా చర్చ జరిగిందనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. 15రోజుల్లోనే రెండోసారి ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ .. ఒకసారి హోంమంత్రి అమిత్‌షాతో.. ఈసారి ప్రధానితో భేటీ అయి చర్చించారు. బయటకు చెప్పన్పటికీ కేంద్రంలో చేరడంపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది. రెండు కేబినెట్‌ మంత్రిపదవులు, ఒక సహాయమంత్రి పదవిని ప్రధానిమోడీ, సీఎం వైఎస్‌ జగన్‌కు ఆఫర్‌ చేశారని అంటున్నారు. కేంద్రంలో వైసీపీ ఉంటే మరింత సమిష్టిగా పనిచేయొచ్చనీ.. రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని ప్రధాని సూచించినట్టు సమాచారం. అయితే, మోడీతోభేటీ తర్వాత ముఖ్యమంత్రి గానీ, ఇతర వైసీపీ నేతలు గానీ స్పందించలేదు. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం.. తమ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అయితేనే మంచిదని, తద్వారా రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా అడ్డుకోగలుగుతామని చెబుతున్నారు.

అటు బీజేపీకూడా వైసీపీ.. కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందనడం తప్పుడు ప్రచారమే అంటోంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి, ఎన్డీఏ చేరడానికే అనడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఏపీలో వైసీపీ, టీడీపీతో కలిసి సాగే పరిస్థితి లేదన్నారాయన. ఈ విషయంలో తమ పార్టీ అధిష్టానానికి పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. మోడీ సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటుందని తేల్చేసారు ఎమ్మెల్సీ మాధవ్.

నిజానికి ఎన్డీఏలో చేరకపోయినా వైసీపీ ఢిల్లీలో కేంద్రానికి అన్నివిధాలా సహకరిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఏ బిల్లుకూ అడ్డుచెప్పలేదు. పైగా రెండు సభల్లోనూ నిస్సంకోచంగా మద్దతు తెలిపింది. ఈ మధ్య వ్యవసాయ బిల్లుపై టీఆర్‌ఎస్ అడ్డం తిరిగినప్పటికీ వైసీపీ మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా ఇరు సభల్లోనూ స్పష్టంగా మద్దతు పలికింది. రానున్న రోజుల్లో కేంద్రంలో ఏ మార్పులూ చేర్పులైనా జరగొచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news