వైసీపీలో ఆ నేత‌ల దూకుడు.. స‌మ‌స్య‌లు సృష్టిస్తోందా…?

-

అవును.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇదే మాట వినిపిస్తోంది. అధికార పార్టీ నేత‌ల దూకుడు కార‌ణంగా ఆ పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్ అప‌వాదులు ఎదుర్కొనాల్సి వ‌స్తోంద‌న్న‌ది రాజ‌కీయ నేత‌ల విశ్లేష‌ణ‌గా ఉంది. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాయ‌కులు ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ప‌రిస్థితులు మార‌తాయి. దానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఓ వ‌ర్గం మీడియా పుల్ల‌లు పెట్టేందుకు సిద్దంగా ఉంది.


ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నేతలు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌స్తుతంమంత్రి స్థాయిలో ఉన్న అవంతి శ్రీనివాస‌రావు.. చేసిన కొన్ని కామెంట్లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో నెక్ట్స్ టార్గెట్ ఎవరంటూ.. అంటూ.. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేశాం.. తర్వాత గంటా శ్రీనివాస్ అరెస్టు కాబోతున్నారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు ఏపీలో పరిస్థితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తెలుగుదేశం పార్టీ నేతలు గ‌లాటా సృష్టిస్తున్నారు.

గత 13 నెలలుగా రాష్ట్రంలో దౌర్జన్యకర వాతావరణం నెల‌కొంద‌ని, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను బ‌త‌క‌నీయడం లేద‌ని, హ‌క్కుల‌ను అణిచేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  మంత్రి అవంతి చేసిన‌ ఈ వ్యాఖ్యలు  మరింత‌గా మంట‌కు ఆజ్యం పోసిన‌ట్ట‌యింది. ఇప్ప‌టికే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్టు చేశామని, నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాస్ అంటూ నేరుగా మంత్రి స్థాయిలోనే వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఇలాంటి వాటి వ‌ల్ల పార్టీకి మేలు జ‌ర‌గ‌క‌పోగా.. కీడే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌నేది కూడా వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Latest news