వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ నటుడు చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. విభజన సమయంలో జరిగిన సంఘటనలతోపాటు చిరంజీవి రాజకీయం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తనను ముఖ్యమంత్రి కాకుండా చిరు అడ్డుపడ్డాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా ‘నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ దానిని చిరంజీవి అడ్డుకున్నారు. చిరు తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ ముఖ్యమంత్రి అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో ఉండేవారు. నిజానికి చిరును నేను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నేను ముఖ్యమంత్రి అయితే చిరు సామాజిక వర్గానికి న్యాయం చేసేవాడిని’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే విభజన సమయంలో జరిగిన సంఘటనలపై త్వరలోనే ఒక పుస్తకం రాయబోతున్నట్లు మంత్రి తెలిపారు. బొత్స చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.