తుంగభద్ర ప్రాజెక్టు లో 19 గేటు కొట్టుకుపోయిన ప్రమాదం లో రికార్డు టైమ్ లో స్టాప్ లాగ్ గేట్ అమర్చారు. గేటు కొట్టుకు పోయి నీరు వృధాగా కొట్టుకు పోతున్న దశలో సీఎం చంద్రబాబు స్పందించారు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డ్యాం భద్రత, గేట్ల అమరికపై నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడును హుటాహుటిన సీఎం పిలిపించారు. తుంగ భద్ర అధికారులు అంతా చేతులు ఎత్తేశారు. ఆ సమయంలో కన్నయ్య నాయుడు తన బృందంతో రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేట్ అమర్చారు.
గేట్ అమర్చే విషయంలో కేంద్ర జల సంఘం కూడా అనుమానాల్ని వ్యక్తం చేసింది. అయినా ధైర్యంతో కన్నయ్య నాయుడు బృందం గేట్ అమర్చి 40 టీఎంసీల నీటిని వృధాగా పోకుండా కాపాడింది. స్టాప్ లాగ్ గేట్ రెండు మూడు భాగాలుగా చేసి అమర్చగలిగారు. కర్ణాటక, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వరద ప్రవాహం ఉన్నా గేటు అమర్చారు. ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సత్కరించారు అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.