ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, వ్యాపారవేత్తలే కాకుండా.. సామాన్యులు కూడా ఎంతో కొంత డొనేషన్స్ ఇస్తున్నారు. విరాళాలు ఇచ్చే వారి కోసం బ్యాంకు అకౌంట్స్ డీటెయిల్స్ తో పాటు యూపీఐ కోడ్ సైతం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అయితే వరద బాధితుల కోసం ఆదివారం ఆదోనిలో భిక్షాటన చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. అంతేకాదు వరద బాధితుల కోసం తన నెల జీతాన్ని అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల అనేక కుటుంబాలకు ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ తనవంతు సహాయం అందించాలని ఆదోని ప్రజలను కోరారు. అనంతరం బిజెపి నాయకులు విట్ట రమేష్ వరద బాధితుల కోసం లక్ష రూపాయలను ప్రకటించారు. ఆ తర్వాత ఆదోని పట్టణంలోని ప్రధాన రహదారిపై బిక్షాటన చేస్తూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరించారు పార్థసారథి.