శ‌భాష్‌ రాజుగారు.. మీక‌న్నా తోపులు బీజేపీలో కూడా లేరు…!

వైఎస్సార్ సీపీ వివాదాస్ప‌ద ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజుకు ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో పెరిగిన ఫాలోయింగ్ అంతా ఇంతాకాదట‌! సోష‌ల్ మీడియా జ‌నాలే చెవులు కొరుక్కుంటున్నారు. ఆయ‌న అటు పార్టీలోనే ఉన్నాన‌ని, ఇక‌పైనా ఉంటాన‌ని అంటూనే..వైఎస్సార్ సీపీ నేత‌లు, అధినేత కూడా ఏదైతే చేయొద్ద‌ని గీత‌లు గీసుకున్నారో.. సంక‌ల్పాలు చెప్పుకొన్నారో.. శుబ్భ‌రంగా ఎంపీ ర‌ఘురామ ఆయా గీత‌ల‌ను అల‌వోక‌గా దేటేస్తున్నారు. ఆయా సంక‌ల్పాల‌ను `తూ..నాబొడ్డు` అనేస్తున్నారు. దీంతో ఎంపీ గారు ఇంకా ఏం చేస్తారా?  ఇంకా చేస్తారా? అంటూ.. సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే చ‌ర్చ‌! ఆస‌క్తి కూడా!

ysrcp mp raghurama krishnamraju to respond on notices issued by party

గడిచిన నాలుగు నెల‌లుగా జ‌రుగుతున్న సోదిని ప‌క్క‌న పెడితే.. రెండు రోజుల కింద‌ట ఈయ‌న‌గారి దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు వైఎస్సార్ సీపీ అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకుంది. లోక్‌స‌భ‌లో ఈ పార్టీ ఎంపీలు కూర్చునే సీట్ల వ‌రుస‌ల‌ను మార్చేసి.. రాజుగారికి చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఆవెంట‌నే స్పందించిన రాజుగారు.. సింహం కూర్చున్న‌దే సింహాస‌నం అని త‌న మిత్రుడి ద్వారా స్టేట్‌మెంట్ ఇప్పించుకుని పోస్టు చేసుకున్నారు. దీంతో ఖంగుతిన‌డం వైఎస్సార్ సీపీ నేత‌ల వంత‌యింది. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. మ‌రో ప‌నిచేసి.. రాజుగారు.. బీజేపీ నేత‌ల‌కే దిమ్మ‌తిరిగేలా చేశారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఎంపీ రఘురామకృష్ణం రాజు తన మూడు నెలల ఎంపీ జీతాన్ని విరాళంగా ఇచ్చారు. వచ్చే నెల ఐదో తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి అకౌంట్‌కు తన విరాళాన్ని రఘురామకృష్ణం రాజు జమ చేశారు. రామాలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా ఈ విరాళం ఇస్తున్నట్లు వెల్లడి చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ప్రపంచ వ్యాప్తంగా వందలకోట్ల హిందువులు రామాలయం భూమి పూజ కోసం ఎదురుచూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఎంపీల‌కు కూడా ఈ థాట్ రాలేదు. దీంతో తామెక్క‌డ ఇరుక్కుపోతామో.. లేదా మోడీ ద‌గ్గ‌ర  వీక్ అవుతామేమోన‌ని తాము కూడా అంతో ఇంతో ఇస్తున్నార‌ట‌! ఇదీ సంగ‌తి.. మొత్తానికి బీజేపీ నేత‌ల‌కు కూడా రాజుగారు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నార‌న్న‌మాట‌.