నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పక్కగా, వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అర్ధమవుతుంది. ఆ పార్టీ నుంచే ఎంపీగా గెలిచే అదే పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ కంటే ఎక్కువగానే రాజుగారు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇలా విరుచుకుపడే రాజుగారికి వైసీపీ నుంచి బాగానే కౌంటర్లు వస్తున్నాయి. ఆయనకు ఏదొకవిధంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజుగారి మీద సిబిఐ దాడులు అనే వార్తలు గుప్పుమన్నాయి. ఆయనకు సంబంధించిన సంస్థలపై సిబిఐ దాడులు జరిగాయని వైసీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశాయి. ఇక రాజుగారి కథ ముగిసిందని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
అయితే వైసీపీ ఈ రేంజ్‌లో చేస్తే, దానికి తగ్గట్టుగానే రాజుగారు కూడా రివర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేసి వైసీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మొదట తనపై సీబీఐ దాడులు జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నందుకు జగన్ పత్రిక, ఛానల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించిన రాజుగారు…ఊహించని విధంగా జగన్ కేసులు గురించి మాట్లాడారు. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన కేసులో ముగ్గురు ప్రముఖులు త్వరలో జైలుకు వెళ్లబోతున్నారంటూ జోస్యం చెప్పారు. అలాగే జగతి మీడియా యాజమాన్య పెద్దలెవరో తనకు తెలుసని మాట్లాడారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే…తనపై సిబిఐ దాడులు అని వైసీపీ అనుకూల మీడియా వార్తలు వేసింది. ఇక దానికి రివర్స్ కౌంటర్‌గా రాజుగారు ఇలా జగతి పబ్లికేషన్స్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్తారని చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ నిజంగానే రాజుగారికి సమాచారం జైలుకు వెళ్ళే ఆ ముగ్గురు ప్రముఖుల పేర్లు కూడా బయటపడితే బాగుండేది. కానీ రాజుగారు అలా చేయకుండా వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికే ఈ రకమైన ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి నాలుగు నెలల్లో జైలుకు వెళ్ళే ఆ ప్రముఖులు ఎవరో ?
-vuyyuru subhash