వైసీపీలో మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారా? ఈ నెల 22న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే అనధికారికంగా వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మార్పులు తథ్యమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే, సదరు మంత్రి జిల్లాలో ఈ విషయం రచ్చగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి రంగనాథరాజు వ్యవహార శైలిపై జిల్లా నుంచే కాకుండా ఇతర మంత్రుల నుంచి కూడా జగన్కు ఫిర్యాదులు అందాయి. జిల్లాలోఅందరినీ కలుపుకొని వెళ్లాలని సీఎం జగన్ ఆయనకు ఇప్పటికే ఒకటి రెండు సార్లు సూచించారు.
ముఖ్యంగా ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని మంత్రులు చాలా మంది భుజాన వేసుకున్నారు. కృష్ణాజి ల్లా సహా గుంటూరులోనూ చాలా మంది టీడీపీ నేతలను వైసీపీ బాట పట్టించారు. అదేసమయంలో కరోనా సహాయ నిధికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వంతు చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్ధికంగా బాసటగా నిలుస్తున్నారు. ఈ రెండు విషయాల్లోనూ మంత్రి రంగనాథరాజు చురుగ్గా వ్యవహరించకపోగా.. జిల్లాలో నేతల మధ్య కయ్యాలకు కారణమవుతు న్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక, మంత్రిగారి కుమారుడు దందాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించారు. ఇక, ఆచంట నియజకవర్గంలోనూ అభివృద్ధి పనులు ఏమీ చేపట్టడం లేదనే విమర్శలు మంత్రిని చుట్టుముట్టాయి. అదేవిధంగా టీడీపీ నేత పితాని సత్యనారాయణ వైసీపీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా మంత్రి అడ్డుకుంటున్నారని, ప్రజా బలం ఉన్న నాయకుడిని అడ్డుకోవడం తగదని స్థానిక నేతలు అంటున్నారు. ఇక, మంత్రి గ్రాఫ్ కూడా ఏడాది కాలంలో ఆశించిన విధంగా లేదనేది కేబినెట్ ఆరోపణ.
పైగా తనకు సంబంధం లేని శాఖలోనూ వేలు పెడుతున్నారనేది పలువురి ఆరోపణ. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రిని సాగనంపడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై జగన్ కూడా దృష్టి పెట్టారని, మంత్రి వర్గ కూర్పు సమయంలో ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.