వాళ్లిద్దరూ ఇష్టపడితే మధ్యలో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటని వైకాపా నేతలను ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య 5నిమిషాల భేటీపై తమ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
ప్రధానితో తమ సీఎం గంటసేపు కలిసి భోజనం చేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మధ్యాహ్న భోజనం 10-15 నిమిషాల్లో ముగిస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజన సమయంలో సీఎం జగన్ ఆయనతో కలిసున్నా దూరంగా కూర్చున్నారని తెలిపారు. తమ పార్టీ 30-35 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెదేపాతో భాజపా జతకట్టే అవకాశాలున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంపై డీవోపీటీ కార్యదర్శి రాధికా చౌహాన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ చేశారనే విషయం ఎలా తెలుస్తుందని ఎంపీ ప్రశ్నించారు. సకలశాఖా మంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.