జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్

2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసు విచారణలో భాగంగా లోకేష్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అయితే లోకేష్ కోర్టుకు హాజరైన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రహదారులను దిగ్బంధించి టిడిపి నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారు అని ప్రశ్నించారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలి అని సవాల్ విసిరారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, సీఎం జగన్ మాదిరిగా వాయిదాలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. 2016 నుంచి తనపై చేసిన అవినీతి ఆరోపణల పై చర్చకు సిద్దమని, తన అవినీతి కేసుల పై చర్చకు సీఎం జగన్ సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.