ఏపీలోని విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్తో పాటు ఇతర నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. సామాన్య ప్రజలు సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని.. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని నారా లోకేశ్ మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై మాట్లాడిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదానికి కారణంపై రెండు వాదనలు వినిపిస్తున్నాయనియయ 24 గంటల్లో విచారణ పూర్తి చేసి కారణం తెలుసుకుంటామని వెల్లడించారు.