మంగ‌ళ‌గిరికి లోకేష్ బైబై.. కొత్త నియోజ‌క‌వ‌ర్గం అదే…!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి బై బై చెప్పనున్నార‌ని టీడీపీలో అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాక‌ నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉంటున్న‌ లోకేష్ చాలా రోజుల తర్వాత ఇప్పుడే నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ ఐదేళ్లపాటు అమరావతిలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొన్న టీడీపీకి గత ఎన్నికల్లో ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి తనయుడుగా ఉంటూ రాజధాని ప్రాంత నియోజకవర్గం ఆయన మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఘోరంగా ఓడిపోయారు.

ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుని… భారీగా డబ్బులు వెద‌జ‌ల్లినా మంగళగిరి ఓట‌రు మాత్రం లోకేష్ ను గెలిపించ లేదు. ఎన్నికలలో ఓడిపోయి యేడాదిన్న‌ర అవుతున్నా ఇప్పటికీ మంగళగిరిలో లోకేష్ గ్రాఫ్ ఎంతమాత్రం పెర‌గ‌లేదు అన్న విషయం టిడిపి అధిష్టానానికి స్పష్టంగా తెలిసి వచ్చిందట. ఈ క్రమంలోనే మరో నియోజకవర్గం వైపు లోకేష్ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందే లోకేష్ కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే చివర్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మంగళగిరి నుంచి వరుసగా వైసీపీ తరఫున రెండు సార్లు విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు పైగా రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే క్యాబినెట్ మార్పుల‌లో ఆయన మంత్రి కూడా కాబోతున్నారు. ఆ తర్వాత వాళ్ల మంగళగిరిలో మరింత పాతుకు పోవడం ఖాయం. ఇక మంగళగిరిలో లోకేష్ ఓటమికి సామాజిక సమీకరణలు కూడా కలిసి రాలేదు అన్న‌ విషయం పార్టీ పరిశీలనలో తేలింది.

దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న చర్చలు పార్టీలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు అనుకున్న‌ పెనమలూరు లేదా గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గాల పేర్లు పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. మరి లోకేష్ మంగళగిరిలోనే ఉంటాడా లేదా కొత్త నియోజకవర్గం కోరుకుంటాడా ? అన్నది చూడాలి.