గుంటూరు: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజల రక్తాన్ని దోచుకుంటున్న ఇలాంటి నాయకులు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్తలను అన్నిటిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు.
ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించిన వారిపై పోలీస్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోతున్న రైతులు ఆవేదన చెందుతుంటే వాళ్లపై కూడా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న వాళ్లు నకిలీ విత్తన కంపెనీలతో కుమ్మక్కయ్యారనిపిస్తుందన్నారు కన్నా లక్ష్మీనారాయణ.