తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. దీనిలో పలు అంశాలను పేర్కొంది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటనతో అక్కడి రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు సంబంధం లేదని కౌంటర్‌లో ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని.. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది. మరోవైపు వాదనలకు సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు తాను వేసిన పిటిషన్‌లో జగన్ రెస్టారెంట్ యజమాని పేరు తప్పుగా రాశారు. హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరిగా పిటిషన్‌లో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పనిచేయలేదని పిటిషన్‌లో జగన్ పేర్కొనగా.. పనిచేశాయని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించామని తెలిపింది.